Online Puja Services

నాయనార్ల గాథలు - అమర్నీతి నాయనారు

3.138.110.119

నాయనార్ల గాథలు - అమర్నీతి నాయనారు
- లక్ష్మీ రమణ

శ్రీకృష్ణ తులాభారం కథని విన్నప్పుడూ , చూసినప్పుడూ అమితమైన ఆనందం కలుగుతుంది.  భగవానుడు ఒక్క తులసీ దళమెత్తు భక్తికి ఎలా వశపడి పోతాడో ఆ కథ చెబుతుంది. భగవానుడు లౌకిక సంపదకి లొంగనివాడు. చిటికెడు భక్తికి చిక్కేవాడు.  ఈ సూత్రానికి కేశవుడు మాత్రమే వశపడతాడనుకుంటే పొరపాటే! శివుడు కూడా ఇలా తులాభారానికి వశపడిన సందర్భం నాయనార్ల చరితల్లో మనకి కనిపిస్తుంది . ఆ విధంగా శివునిభక్తినే త్రాసులో వేసి,  తూచిన వారు అమర్నీతి నాయనారు. ఆ దివ్య ఉదంతాన్ని ఇక్కడ తెలుసుకుందాం . 

అమర్నీతి నాయనారు రత్నాల వ్యాపారి. దేశ విదేశాల నుండీ తెప్పించిన మేలు జాతి రత్నాలు ఆయన దగ్గర లభించేవి. చేసేది వ్యాపారమే అయినా ధర్మాన్ని తప్పకుండా తన వృత్తిని  కొనసాగించేవారు అమర్నీతి.  ఆయనకి ఈశ్వర ఆరాధన పట్ల అమితమైన మక్కువ. నిత్యమూ శివార్చనలు చేసేవారు. శివాలయాలలో ప్రత్యేక అభిషేకాలూ , పూజలూ, పర్వాలలో  విశేషమైన పూజలూ నిర్వహించేవారు. విభూది, రుద్రాక్షలు తదితరాలైన ఈశ్వర చిహ్నములు ధరించిన వారు ఎవరు ఎదురైనా వారిని స్వయంగా ఈశ్వరుడే వచ్చారని భావించి గౌరవించి పూజించే వాడు.  ప్రత్యేకించి ఈశ్వర భక్తులకి  కౌపీనాలు దానంగా ఇస్తూ ఉండేవారు. భోజనాలు పెట్టి, కొత్తబట్టలు పెడుతూ ఉండేవాడు.  

ప్రత్యేకించి తిరునల్లూరులో వేంచేసి ఉన్న  దర్భారణ్యేశ్వరుడంటే అమర్నీతి  నాయనారుకి మహా భక్తి. నల మహారాజు పరిపాలించిన నేల మీద, దర్భారణ్యంలో, శని ప్రభావం నుండీ రక్షించే స్వామిగా నెలకొన్నవాడు తిరునల్లూరు  దర్భారణ్యేశ్వరన్ స్వామి. తిరు అంటే శ్రీ అని,  నల్లూరు అంటే నలమహారాజు అని అర్థం. ఆయన పేరుమీదే ఆ క్షేత్రానికి తిరునల్లూరు అని పేరొచ్చింది అని స్థలపురాణం. దర్భారణ్యేశ్వరన్ స్వామి మహా మహిమోపేతుడు.  నలమహారాజుకి శాప విమోచనాన్ని అనుగ్రహించినవాడు. అగ్నిలో ఉంచినా కూడా కాలిపోని జ్ఞాన సంబందార్ నాయనారు  తేవారాల సాక్షిగా సనాతనధర్మాన్ని నిరూపించి , రక్షించినవాడు.  

 ప్రతి పండుగకి తిరునల్లూరు వెళ్లి అక్కడ స్వామి సన్నిధిలో పూజాదికాలు నిర్వహించుకొని, అక్కడి భక్తులకి ఇతోధికంగా సేవలు చేసుకొని,  కౌపీనాలు దానంగా ఇచ్చి వస్తుండేవాడు. కానీ, దర్భారణ్యేశ్వరుణ్ణి వదిలి తిరిగి సొంత ఊరికి రావడమంటే, తల్లిని వీడి వచ్చే బిడ్డలా, గురువుని వదిలి వచ్చే శిష్యునిలా ఉండేది అమర్నీతి నాయనారు పరిస్థితి.  వీడలేక వీడలేక తిరునల్లూరు వదిలేవాడు. వచ్చిన దగ్గరి నుండీ మళ్ళీ ఆ స్వామీ  వెళదామా అనే ఆత్రం ఆయన్ని నిలువనిచ్చేది కాదు.  

ఒకనాడు, ఇక  ఆ దర్భారణ్యేశ్వరుని వదిలి ఉండలేనని నిశ్చయించుకొని, తన బంధు మిత్ర పరివారము అందరితో కూడా కలిసి తిరునల్లూరుకే శాశ్వతంగా మకాం మార్చేశాడు. అక్కడ అనిత్యమూ ఆ స్వామీ సన్నిధిలో పూజాదికాలు చేస్తూ, భక్తుల సౌకర్యార్థం వారు ఉండేందుకు వీలుగా ఒక మఠాన్ని నిర్మించాడు.  శివభక్తులని తమ ఇంటికి ఆహ్వాన్నిస్తూ వారికి నిత్యమూ కౌపీనాలని బహుమతులుగా ఇస్తూ, సేవిస్తూ సంతోషిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు . 

ఈ విధంగా ఆ అమర్నీతి నాయనారు చేస్తున్న తపస్సుకు ఈశ్వరుడు ప్రీతి చెందాడు.  ఈశ్వర భక్తులని సేవిస్తే, అది తన సేవ కన్నా మిన్నని మురిసిపోతాడట పరమేశ్వరుడు . ఈ అమర్నీతి నాయనారుని అనుగ్రహించాలి అని అనుకున్నారు.   దానికోసం , తానే స్వయంగా తన భక్తుని రూపాన్ని ధరించాడు.  విభూది రేఖలు పెట్టుకొని, రుద్రాక్షలు ధరించి, నెత్తిన పెద్ద కొప్పు చుట్టుకొని నవ యవ్వనంతో ఉన్న యువకుడిగా అమర్నీతి నాయనారు కట్టించిన సత్రానికి వెళ్ళాడు. అసలే ఆయన సుందరేశ్వరుడు, జ్ఞానస్వరూపుడు.   యువకుని రూపంలో వెళ్లారేమో, అద్భుతమైన రూపలావణ్యము, జ్ఞాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు.  చూసిన వారు చూపు తిప్పుకోలేక పోతున్నారు.  అమర్నీతి నాయనారు  ఈ యువకుణ్ణి చూస్తూనే, అపరశివుడే ఈ యోగిగా దిగివచ్చాడేమో అనుకున్నాడు.  సాదరంగా ఇంటికి ఆహ్వానించాడు.  చక్కగా అర్ఘ్యపాద్యాదులిచ్చి, షడ్రసోపేతమైన భోజనాన్ని దగ్గరుండి వడ్డించాడు.  ఆ తర్వాత కౌపీనాన్ని దానంగా ఇచ్చాడు.  ఆ యుకుడు ఆ కౌపీనాన్ని ధరించి, తాను  వేసుకొని ఉన్న కౌపీనాన్ని విప్పి , అమర్నీతి నాయనారుకి ఇచ్చాడు. “ ఓ వైశ్యా ! నీ ఆతిధ్యానికి నేను సంతుష్టిని పొందాను. అందువల్ల నీకు మరొక బాధ్యతని అప్పజెబుతున్నాను.  నా ఈ కౌపీనము మహిమాన్వితమైనది . ప్రత్యేకమైనది.  దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచు.  బయట వర్షం పడుతోంది.  నేను అవసరంగా బయటకి వెళ్ళి రావాలి.  నేను తిరిగి వచ్చేప్పటికి ఇప్పుడు నేను ధరించి ఉన్న కౌపీనం తడిసి పోతుంది.  కనుక నేను వచ్చాక నా ఈ పొడి కౌపీనాన్ని తిరిగి ధరిస్తాను. జాగ్రత్త సుమా !” అని చెప్పి , తాను విడిచిన కౌపీనాన్ని అమర్నీతికి ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు . 

అమర్నీతి భక్తిగా ఆ యువ యోగి కౌపీనాన్ని కనులకి అద్దుకొని, జాగ్రత్తగా భద్రపరిచాడు.  ఈశ్వరుడు లీలాప్రియుడు కదా ! ఆయన అమర్నీతి దాచి ఉంచిన కౌపీనాన్ని మాయం చేసేశాడు . 

కొద్దిసేపటి తరువాత మాయా యువ యోగి తిరిగి అమర్నీతి దగ్గరికి వచ్చాడు.  ఆయన కౌపీనము వర్షానికి తడిసిపోయింది.  “ అయ్యా ! నీ దగ్గర ఉంచిన కౌపీనము తీసుకురండి.  ఈ తడి బట్టలు మార్చుకుంటాను” అన్నాడు. అమర్నీతి తాను ఆ కౌపీనాన్ని భద్రపరచిన చోటుకు పరుగున వెళ్ళాడు.  ఈశ్వరుడి లీల వల్ల  అది ఎంత వెతికినా, అమర్నీతికి దొరకలేదు.  అదే విషయాన్ని ఆ యువ యోగికి విన్నవించాడు . “ యోగీశ్వరా !మీ కౌపీనాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచాను. ఏం జరిగిందో తెలీదు గానీ అది దొరకడం లేదు.  నేను దానికి బదులుగా మీకు మరొక కొత్త కౌనీనముల జతను ఇస్తాను. స్వీకరించి ఈ దీనుణ్ణి క్షమించి , అనుగ్రహించండి” అని ప్రార్ధించాడు. 

ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు ఆ యోగీశ్వరుడు. క్షమించడం కుదరదన్నాడు.  అది మహిమాన్వితమైనది కాబట్టి, తనకి ఆ కౌపీనము తిరిగి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. తన కౌపీనానికి సృష్టిలోని మారె వస్తువూ కూడా సరోతూగలేదన్నాడు. అమర్నీతి అనేకానేక విధాలుగా ప్రార్ధించిన మీదట, ఆయన తాను ధరించిన కౌపీనానికి సమానమైన బరువు కలిగిన కౌపీనాన్ని, సంపదను  గ్రహించడానికి ఒప్పుకున్నాడు.  

అది ఈశ్వరుడు ధరించిన కౌపీనము. సృష్టంతా తానైన వాడిని సృష్టిలోని ఏ సంపద తూచగలదు ?  ఈశ్వర లీల ఎరుగని అమర్నీతి వెంటనే ఒక త్రాసుని తెప్పించాడు.  దానిలో ఒక వైపు ఆ యోగి ధరించిన తడి కౌపీనాన్ని ఉంచారు. మరో వైపు కొత్త కౌపీనాన్ని ఉంచారు .  బరువు తూగలేదు.  మరో రెండు కొత్తజతలు రెండవ వైపున వేశారు .  అయినా అవి యోగి కౌపీనాన్ని తూచలేకపోయాయి.  ఆశ్చర్యపోయిన అమర్నీతి తన దగ్గరున్న రత్న రాసులు , బంగారమూ తదితర సకల సంపదనంతా ఆ తాసులో వేశాడు .  అయినా అవి ఆ కౌపీనం బరువు తూగలేకపోయాయి. ఇక తనని తానే, కుటుంబముతో సహా  త్రాసులో వేసుకో నిశ్చయించుకున్నాడు . ఆ త్రాసులో కూర్చొనే ముందర,  “ ఓ పరమేశ్వరా !  నేను శివభక్తులని చిత్త  శుద్ధితో సేవించి ఉన్నట్లయితే, ఈశ్వరార్చనని క్రమం తప్పకుండా భక్తితో చేసి ఉన్నట్టయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక!” అనుకున్నాడు .  వెంటనే ఆ త్రాసు చక్కగా సరితూగింది. 

అప్పుడు గ్రహించాడు అమర్నీతి ఆ వచ్చిన యువ యోగి ఎవరో ! వెంటనే ఆయన పాదాల మీద పడి శరణు వేడాడు. “ స్వామీ ! నేను ధన్యుడనయ్యాను.  నీ దర్శనం, స్పర్శనం చేత నా పాప రాశి దహించుకు పోయింది. ఈశ్వరా! ఐశ్వర్య ప్రదాయకుడంవైన  నిన్ను గుర్తించలేక, నీ కౌపీనాన్ని నాదగ్గరున్న రత్నాలతో, ఐశ్వర్యంతో తూచాలని ప్రయత్నించాను. భక్తికి మాత్రమే నీవు వశుడవు. దేవదేవా ! నా పొరపాటును మన్నించి , నన్ను అనుగ్రహించు” అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు. ఈశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించి ఉమాసహితుడై అక్కడున్న వారందరికీ నిజ దర్శనాన్ని అనుగ్రహించాడు.  

“ ఓ అమర్నీతి! నీ కౌపీన దాన నిష్ఠకు, శివ సేవా తత్పరతకూ నేను ఎంతో సంతుష్టిని పొందాను . నీ భక్తిని లోకానికి చాటేందుకే  నేను నీకీ పరీక్షలు పెట్టాను.  ఇక నీవు ఉండవలసింది భూలోకములో  కాదు, పద నిన్ను కైలాసానికి తీసుకు వెళతాను” అని కైలాసాన్ని అనుగ్రహించారు.  శివానుగ్రహం వలన ఆయన కూర్చొన్న తక్కెటే, దివ్య విమానముగా మారి అమర్నీతి నాయనారుని భార్యాపిల్లలతో సహా కైలాసానికి తీసుకొని పోయింది.   

అమర్నీతి నాయనారు కథని విన్నా, చదివినా ఈశ్వరానుగ్రహం చేత అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఐశ్వరం సిద్ధిస్తుంది . అంతకుమించి స్వామి పాదాలపై నిశ్చలమైన భక్తి  నిలుస్తుంది. ఆ  దర్భారణ్యేశ్వరుని కృపాకటాక్షాలు హితోక్తి పాఠకులకి సర్వదా లభించాలని కోరుకుంటూ .. 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి పాదారవిందార్పణమస్తు . 

 

Nayanar, Stories, Amarneethi, Amarneeti, Shiva, Siva

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda